Satyam Sundaram Review : తమిళ హీరో కార్తీ ‘సత్యం సుందరం’ సినిమా రివ్యూ

తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు...

Satyam Sundaram : నటీనటులు: కార్తి(Karthi), అరవింద్‌ స్వామి, శ్రీదివ్య, దేవ దర్శిని, రాజ్‌కిరణ్‌; స్వాతి కొండె, జయప్రకాశ్‌, శ్రీరంజని తదితరులు.
సినిమాటోగ్రఫీ: మహేంద్రన్‌ జయరాజ్‌
ఎడిటింగ్‌: ఆర్‌.గోవిందరాజ్‌
సంగీతం: గోవింద్‌ వసంత
నిర్మాతలు: జ్యోతిక – సూర్య
తెలుగు విడుదల: సురేష్‌ ప్రొడక్షన్స్‌
దర్శకత్వం: సి. ప్రేమ్‌కుమార్‌

తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తి(Karthi) గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో కూడా ఆయన చిత్రాలకు మంచి క్రేజ్‌, మార్కెట్‌ ఉంది. కథల ఎంపికలో కార్తి(Karthi)కి మంచి టేస్ట్‌ ఉంది. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘మెయ్యళగన్‌’. తమిళంలో 27 విడుదల కాగా, ‘సత్యం సుందరం(Satyam Sundaram)’ టైటిల్‌తో తెలుగులో 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ 96’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సి. ఫేమ్‌ ప్రేమ్‌ కుమార్‌ నవలగా రాసుకున్న కథను సత్యం సుందరం(Satyam Sundaram)’ సినిమాగా తెరకెక్కించారు. బంధాలు, భావోద్వేగాల సమాహారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

Satyam Sundaram – కథ:

సత్యం, తన కుటుంబం ఉద్దండరాయుని పాలెంలో తరతరాలుగా వస్తున్న ఇంట్లో నివశిస్తుంటారు. బంధువుల వల్ల ఆస్తి తగాదాలతో సత్యమూర్తి (అరవింద్‌ స్వామి), ఆయన తండ్రి రామలింగం (జయప్రకాశ్‌) మూడు తరాలుగా నివసిస్తున్న ఇంటిని కోల్పోతారు. ఇక ఆ గ్రామంలో ఉండటం ఇష్టం లేక వైజాగ్‌ వెళ్లి స్థిరపడతారు. దాదాపు 20 ఏళ్లు సొంతూరికి, బంఽధువులకు దూరంగా ఉంటారు. సత్యం. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నాన్న కుమార్తె భువన (స్వాతి కొండె) వివాహానికి వెళతారు. అక్కడ బావా అంటూ ఎంతో ఆప్యాయంగా తనను తాను పరిచయం చేసుకుంటాడు ఓ వ్యక్తి (కార్తీ). సత్యమూర్తి చుట్టూనే తిరుగుతుంటాడు. చిన్నప్పటి జ్ఞాపకాలను చెబుతుంటాడు.

బంక మట్టిలా వదలకుండా సత్యంతో మాట్లాడుతూనే ఉంటాడు. సత్యానికి మాత్రం తనను బావ అని పిలుస్తున్న అతనెవరో తెలీదు. తెలుసుకోవాలని ప్రయత్నించిన ఫలించదు. అతని పేరు కూడా తెలీదు. బస్సు మిస్‌ కావడంతో ఒక రోజు అతని ఇంట్లోనే ఉంటాడు సత్యం. అతని ప్రేమకు ఫిదా అయిపోతాడు. అసలు సత్యమూర్తిని బావా అంటున్న వ్యక్తి పేరు ఏమిటి? అతని జీవితంలో సత్యమూర్తి వల్ల వచ్చిన మార్పులు ఏంటి. సత్యమూర్తికి అతనేం అవుతాడు అన్నది కథ.

విశ్లేషణ:

జీవితంలో చవిచూసిన కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని సందర్భాల్లో మనమేంటో మనమే మరచిపోతుంటాం. పలు కారణాలతో అయినవారికి దూరంగా ఉంటాం. నలుగురి తోడుకి దూరమవుతాం. అయితే మన ప్రమేయం లేకుండా మన వల్ల వేరొకరి జీవితంలో జరిగే మంచి ఒక్కోసారి మనమేంటో మనకు తెలియజేస్తుంది. చేసిన తప్పుల్ని సరి చేస్తుంది. అలాంటిదే ఈ కథ. మనిషి జీవితం ఆనందంగా ఉండాలంటే డబ్బు, పేరు మాత్రమే కాదు. మంచి కోరే మనిషి అవసరం అన్న ఇతివృత్తానికి బంధాలు, భావోద్వేగాలను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. నవలగా రాసిన కథను సినిమాగా తెరకెక్కించడం, అది కూడా ఓ కమర్షియల్‌ హీరోతో ఈ సినిమా చేయడం దర్శకుడు చేసిన సాహసం అనే చెప్పాలి.

హీరోగా కార్తి(Karthi) ట్రెండ్‌ గురించి తెలిసిందే. ఆయన కమర్షియల్‌ చిత్రాలే కాదు ప్రయోగాలకు వెనకాడరు. కథ మంచిది అనిపిస్తే… పాత్ర ఎలా ఉన్నా ముందడుగు వేసేస్తారు. ఈ కథలో కమర్షియల్‌ హంగులు లేవు. నాలుగు పాటలు, ఫైట్లు, రొమాన్స్‌, గ్లామర్‌ లేదు. సింపుల్‌ కథ మాత్రమే ఉంది. కానీ తెరపై కనిపించిన ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంది. ఇలా వచ్చి అలా వెళ్లే సన్నివేశాలు అసలే లేవు. కథ, పాత్రల చిత్రీకరణ విషయంలో దర్శకుడు తీసుకున్న మొదటి జాగ్రత్త అది. ఇందులో కనిపించే ప్రతి పాత్ర తెరపై తమను తాము చూసుకుంటారు అనే భావన కలిగేలా దర్శకుడు తెరకెక్కించారు. సినిమా ప్రారంభ సన్నివేశం సొంత ఊరిని, ఉన్న ఇంటికి వదిలి వెళ్లలేక ఓ కుర్రాడు కన్నీరుమున్నీరవుతుంటే… అతడి పాత్రతో మనమూ ప్రయాణిస్తాం.

అతని భావోద్వేగం మనది అని భావిస్తాం. జీవితంలో మనకు అయినవాళ్లే మోసం చేస్తారని, తన కుటుంబాన్ని తప్ప ఎవరినీ నమ్మకుండా ఉండే సత్యం లాంటి వ్యక్తికి.. ఎలాంటి సాయం ఆశించకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారని సత్యమూర్తి పాత్రతో చక్కగా చెప్పారు. ఇందులో పాత్రలను ఓన్‌ చేసుకునేలా చేయడంలోనే దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. కార్తి(Karthi) పాత్ర స్వచ్ఛమైన మంచి మనసున్న మనిషిగా చూపించారు. దర్శకుడు ఈ కథ విషయంలో నమ్ముకుంది రెండే.. వినోదం, భావోద్వేగం. ఈ రెండింటిని జంట పక్షుల్లాగా ఒకదానితో ఒకటి ట్రావెల్‌ అయ్యేలా చేశారు. సినిమా నిడివి దాదాపు మూడు గంటలు. లెంగ్త్‌ ఎక్కువ, దానితోపాటు ల్యాగ్‌ కూడా ఉంది. ల్యాగ్‌ అనిపించిన ప్రతిసారీ వినోదమో, భావోద్వేగ సన్నివేశామో ఆ ఫీలింగ్‌ కలగకుండా చేశాయి.

సీన్లుగా చూసుకుంటే… చెల్లెలు భువన పెళ్లికి తనకు ఎంతో ఇష్టమైన వస్తువులు గిఫ్ట్‌గా తెచ్చి వేదికపై ఇస్తూ… గాజులు తొడిగి, కాళ్లకు పట్టీలు పెట్టే సన్నివేశం ఎంతో హృద్యంగా ఉంది. ఆ సన్నివేశంలో మన కళ్లకు తెలియకుండానే కళ్లు చెమర్చుతాయి. అలాగే కార్తి(Karthi) సైకిల్‌ గురించి చెప్పే సన్నివేశం, దాని తాలుక జ్ఞాపకాలు, ఇంట్లో పెంచుకునే గిత్త గురించి చెప్పే సీన్‌, బావా అని పిలిచే వ్యక్తి పేరు తెలుసుకోవడం కోసం అరవింద్‌ స్వామి పడే తపన, అసలు కార్తి(Karthi) పేరు ఏంటి? చిన్నతనంలో సత్యం, కార్తి పాత్రకు మఽధ్య ఎలాంటి మధుర జ్ఞాపకాలున్నాయి అని గుర్తు చేస్తే సన్నివేశాలు బాగా కనెక్ట్‌ అవుతాయి. ఒక్కసారిగా చిన్నతనంలోకి తీసుకెళ్తాయి. సినిమా టైటిల్‌లోనే కార్తి పేరు ఏంటో తెలుసు. కానీ కథ నడుస్తున్న క్రమంలో అది తెలియకుండా అతని పేరు ఏంటో తెలుసుకోవాలనే ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్‌ చేశాడు దర్శకుడు.

ఇక ఆర్టిస్ట్‌ పనితీరుకు వస్తే.. కార్తి నటనకు పేరు పెట్టలేం. సుందరం పాత్రకు వంద శాతం న్యాయం చేశాం. వినోదాన్ని ఎంతగా పంచాడో, అంతే భావోద్వేగాన్ని కలిగించాడు. ఇదే విధానంలో అరవింద్‌ స్వామి కూడా చేశారు. సత్యంగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. వీరిద్దరూ తెరపై నటించారు అనే కంటే జీవించారు అనొచ్చు. సత్యం–సుందరం పాత్రలకు కార్తి– అరవింద్‌ స్వామి సరిగ్గా సరిపోయారు. శ్రీదివ్య కనిపించింది కాసేపే అయిన చక్కగా నటించింది. అలాగే దేవ దర్శిని, రాజ్‌కిరణ్‌; స్వాతి కొండె, జయప్రకాశ్‌, శ్రీరంజని తమ పాత్ర మేరకు చక్కగా అభినయించారు. ఏ పాత్రలోనూ అతి అనిపించలేదు. సాంకేతిక నిపుణుల సంగతికొస్తే… సంగీత దర్శకుడు గోవింద్‌ వసంత్‌ చక్కని పాటలు, నేపథ్య సంగీతం అందించారు. పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి.

సినిమాటోగ్రాఫర్‌ మహేందిరన్‌ జయరాజు తన కెమెరా పనితనంతో మెస్మరైజ్‌ చేశారు. డబ్బింగ్‌ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అరవింద్‌ స్వామికి హేమ చంద్ర వాయిస్‌ పర్ఫెక్ట్‌ యాప్ట్‌ అయింది అనువాద చిత్రం అయినప్పటికి బస్సులు, ఊర్ల పేర్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. తెలుగుదనం తీసుకురావడానికి రాకేంద్‌ మౌళి చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి. నిడివి విషయంలో ఎడిటర్‌ కాస్త కత్తెర వేసుంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి.

కొన్ని సినిమాల్లో కథ ఏంటనేది మాటల్లోనో, రాత పూర్వకంగానో చెప్పలేం. వాటిని చూసి ఆస్వాదించాలంతే. అలాంటిదే సత్యం సుందరం(Satyam Sundaram)’. ఆస్తి తగాదాలు, కుటుంబాలు విడిపోవడం, దగ్గర వారికి దూరంగా ఉండటం, అనేది కొత్త పాయింట్‌ ఏమీ కాదు. కానీ ఆ కథను ప్రేక్షకులు అంగీకరించేలా ఎలా ప్రజంట్‌ చేశామన్నది ముఖ్యం. ఈ చిత్రం విషయంలో దర్శకుడు అదే చేశాడు. తను నమ్ముకున్న వినోదం, భావోద్వేగాలను తెరపై చూపిస్తూ దానికి ప్రేక్షకులు ఓన్‌ చేసుకునేలా చేశాడు. మనల్ని మనం గుర్తు చేసుకునేలా, బాల స్మృతుల్ని కళ్ల ముందు మెదిలేలా చేశాడు.

అంతకు మించి కొన్ని సన్నివేశాల్లో కంటికి తెలియకుండా కళ్లు చెమర్చేలా చేశాడు. సొంతూరులో రెండు పెద్ద ఇళ్లు, ఓ పెళ్లి మండపం, వాగు, ఇంటి వెనుక పెరడు ఓ పది పాత్రలు ఇవే ఈ సినిమాలో ఎక్కువగా కనిపించింది. కమర్షియల్‌ హంగులు లేవు. సందర్భానుసారంగా సాగే పాటలే తప్ప గ్లామర్‌ పాటలకు, ఛాన్సే ఇవ్వలేదు. ఫైట్స్‌కి అసలు తావే లేదు. ఏ మాత్రం కమర్షియల్‌ కోణం లేని మట్టి సినిమా ఇది. బ్యూటిఫుల్‌ ఎమోషనల్‌ జర్నీ.

Also Read : Samantha : చాలా రోజుల గ్యాప్ రావడంతో స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న సమంత

CinemakarthiReviewsSatyam SundaramTrendingUpdatesViral
Comments (0)
Add Comment