Celebrity Cricket League: సినీ క్రీడా వినోద సంరంభం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) – 2024…. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. 8 భాషలకి చెందిన సుమారు 200 మంది సినీ తారలు 8 జట్లుగా తమ క్రికెట్ ఆటతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఎప్పుడూ వెండితెరపై వినోదాన్ని అందించే సినీతారలు… ఈ సీసీఎల్-2024 ద్వారా మైదానంలో వినోదాన్ని పంచేందుకు సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎల్-2024కు సంబంధించిన ప్రోమో ఆవిష్కరణ వేడుక దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో అట్టహాసంగా జరిగింది. సోనూ సూద్(Sonu Sood), కిచ్చా సుదీప్, సోహైల్ ఖాన్, ఆర్య, జీవా, తమన్, సుధీర్ బాబు తదితరులు పాల్గొని గ్లోబల్ మెట్రోపాలిస్, వండర్‌ఫుల్ బుర్జ్ ఖలీఫాపై సీసీఎల్ పదో సీజన్ ప్రోమోను గ్రాండ్ గా లాంచ్ చేశారు.
Celebrity Cricket League 2024 Updates
ఈ ప్రోమో రిలీజ్ ఈవెంట్ లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లోని మొత్తం 8 జట్లల కెప్టెన్లు… కిచ్చా సుదీప్ (కన్నడ), సోహైల్ ఖాన్ (హిందీ), ఆర్య, జీవా (తమిళం), థమన్ అండ్ సుధీర్ బాబు (తెలుగు), జిస్సు సేన్‌గుప్తా (బెంగాల్), బన్ను ధిల్లాన్, సోనూ సూద్ (పంజాబీ), ఇంద్రజిత్ సుకుమారన్, ఉన్ని ముకుందన్ (మలయాళం) దుబాయ్ లో ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినీ ప్రేక్షకులకు హీరోలంటే ఎంతో అమితమైన అభిమానం. ఆ అభిమానంతోనే థియేటర్లలోకి వెళ్లి వారి సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తారు. వారిని ఎంకరేజ్ చేస్తారు. అలాగే హీరోలు సైతం తమ డైలాగ్స్, ఫైట్స్, డ్యాన్స్‌లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పటివరకు థియేటర్, ఓటీటీల్లో తమ సినిమాలతో సందడి చేసిన హీరోలు, నటులు ఇప్పుడు మైదానంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి తదితర పనులతో అలరించేందుకు సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ను ప్రారంభించారు. ఇప్పటికే తొమ్మిది సీజన్ లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సీసీఎల్… ఈ నెల 23 నుండి పదో సీజన్ తో అభిమానులను అలరించేందుకు సిద్ధమౌతోంది. ఆడ్రినలిన్-పంపింగ్ టోర్నమెంట్ సోనీ స్పోర్ట్స్ టెన్ 5, జియో సినిమా, పలు ప్రాంతీయ ఛానెల్‌లో ఈ క్రికెట్ లీగ్ పదో సీజన్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఈ సందర్భంగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ ఇందూరి మాట్లాడుతూ.. ‘‘సీసీఎల్(CCL) మొదటి నుంచీ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇది పదో సీజన్. సీనీ తారల్లోని క్రికెట్ తపనతో ప్రతీఏటా ఈ లీగ్ మరింత వృద్ధి సాధిస్తోంది. గతంలో కంటే ఈ ఏడాది మరింత ఘనంగా మ్యాచ్ లు జరుగుతాయి. ఈ నెల 23న షార్జాలో ప్రారంభమయ్యే ఈ టోర్నీ… భారత్ లో మరో మూడు వీకెండ్ లతో మొత్తం 20 మ్యాచ్ లతో సినీ, క్రీడా ప్రేమికుల్ని అలరిస్తుంది. CCL 2024 గతంలో కంటే బిగ్గర్‌గా ఉండబోతుంది’’ అన్నారు.
బుర్జ్ ఖలీఫా ప్రోమో లాంచ్ గురించి కిచ్చా సుదీప్ మాట్లాడుతూ “సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అనేది సినిమా, క్రికెట్‌ను కలిపే స్పోర్టైన్‌మెంట్. భారతదేశంలో 8 విభిన్న భాషల నుంచి 200+ మంది నటీనటులను ఒకచోట చేర్చే ఏకైక స్పోర్ట్స్ లీగ్. ఇది క్రీడలు, వినోదాల కలయిక. నేను ఇంతకుముందు నా సినిమాల కోసం బుర్జ్ ఖలీఫా వచ్చాను. క్రికెటర్‌గా బుర్జ్ ఖలీఫాలో ఉండటం చాలా ప్రత్యేకమైనది, ఇది మరచిపోలేనిది” అని అన్నాడు.
“మన గొప్ప దేశంలోని 8 పవర్ ఫుల్ ఫిల్మ్ ఇండస్ట్రీలు ప్రాతినిధ్యం వహిస్తున్న సూపర్‌స్టార్‌లతో కలిసి ఉండటం, ప్రపంచంలోని ఎత్తైన ఐకానిక్ నిర్మాణం ముందు నిలబడి మొత్తం భారతదేశం ఉద్వేగభరితంగా ఇష్టపడే లీగ్ ప్రారంభోత్సవాన్ని వీక్షించడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ సంవత్సరం CCL అద్భుతమైన ఎడిషన్‌గా అలరిస్తుంది” అని సోనూ సూద్ అన్నారు.
Also Read : Manchu Laxmi: నాగలాపురం నాగమ్మగా మంచు లక్ష్మి !