Bastar The Naxal Story: చిన్న సినిమాగా ప్రారంభమై… కాంట్రవర్సీ స్టోరీగా రిలీజ్ కు ముందే సంచలనంగా మారి… విడుదలైన తరువాత బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ‘ది కేరళ స్టోరీ’. సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై విపుల్ అమృత్ లాల్ షా నిర్మాతగా సుదీప్తో సేన్ దర్శకత్వంలో అదాశర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ సినిమాలో… కేరళకు చెందిన ముగ్గురు యువతులను ప్రేమపేరుతో మభ్యపెట్టి ఇస్లాం మతంలోకి మార్చి… చివరకు విదేశాలకు తీసుకెళ్ళి తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) లో చేర్చడం కథాంశంగా తెరకెక్కించారు. దీనితో ఈ సినిమా “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమా తరహాలో వివాదాస్పదంగా మారింది. అయితే థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా తన సత్తా చాటుతోంది.
ఈ నేపథ్యంలో విపుల్ అమృత్ లాల్ షా, సుదీప్తోసేన్, అదాశర్మ కాంబినేషన్ లో మరో సంచలనానికి తెరతీసారు. వీరి కాంబినేషన్ లో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ(Bastar The Naxal Story)’ ను తెరకెక్కించారు. బస్తర్ జిల్లాలో పోలీసు బలగాలపై మావోయిస్టుల ఘాతుకాలు, అడవి బిడ్డలపై అమానుష దాడులు ఇతి వృత్తంగా ఈ సినిమాను తెరకకెక్కించినట్లు తెలుస్తోంది. మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీనితో మావోయిస్టుల హింసనే ఎక్కువగా చూపిస్తూ… సంచలనం కోసమే ఈ సినిమాను తెరకెక్కించారనే విమర్శలు ప్రారంభమయ్యాయి.
Bastar The Naxal Story – ట్రైలర్ ఎలా ఉందంటే ?
మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ విషయానికి వస్తే… ‘ఐసిస్, బోకోహరామ్ ల తర్వాత ప్రపంచంలోనే అత్యంత పాశవికమైన తీవ్రవాదులు భారత మావోయిస్టులే’ అనే డైలాగులతో ఈ ట్రైలర్ మొదలైంది. ‘పాకిస్థాన్‌తో జరిగిన నాలుగు యుద్ధాల్లో కన్నా… మావోయిస్టుల దుశ్చర్యల కారణంగానే చనిపోయిన సైనికులే ఎక్కువ…’, ‘దిల్లీలోని ఎర్రకోటలో ఎర్రజెండా ఎగరవేయడానికి… భారతదేశంలో మావోయిస్టు ప్రభుత్వం ఏర్పడటానికి రక్తం ఏరులై పారాల్సిందే…’ లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
బస్తర్ ప్రాంతంలోని సామాన్య ప్రజలపై మావోయిస్టులు సాగించిన అమానుషాలు… మందుపాతర పేల్చి 76మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న వైనం… ఇందులో స్పష్టంగా చూపించారు. మావోయిస్టులను అణచివేయడానికి నియమితురాలైన ఐపీఎస్ అధికారి నీరజా మాధవన్ గా అదాశర్మ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుంటూనే… మరోవైపు మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడానికి తను ఎలాంటి యాక్షన్ కి దిగిందో తెలుసుకోవాలంటే… మార్చి 15 వరకూ ఆగాల్సిందే.
Also Read : Hanuman Updates : చిన్న సినిమాగా మొదలై హాలీవుడ్ వరకు చేరిన ‘హనుమాన్’