Bahubali Crown Of Blood: మరో ‘బాహుబలి’ విడుదలకు సిద్ధమౌతోన్న రాజ‌మౌళి !

మరో ‘బాహుబలి’ విడుదలకు సిద్ధమౌతోన్న రాజ‌మౌళి !

Bahubali Crown Of Blood: తెలుగు చలన చిత్ర పరిశ్రమను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి సిరీస్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ కు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా వందల కోట్ల రూపాయల వసూళ్ళను రాబట్టి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను కొల్లగొట్టింది. దీనితో ‘బాహుబలి-3’ ఉంటుందని అప్పట్లు వార్తలు వచ్చాయి. అయితే దర్శకుడు రాజమౌళి మాత్రం ఆ వార్తలకు బ్రేక్ ఇచ్చి…. ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో అంతర్జాతీయ స్థాయి సినిమాను తీసి ఆస్కార్ ను ఒడిసి పట్టుకుని భారత్ కు తీసుకువచ్చాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో అంతర్జాతీయ స్థాయిలో ఓ యాక్షన్ అడ్వెంచర్‌ ను తెరకెక్కించడానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు రాజమౌళి అండ్ కో. ఇలాంటి సమయంలో ‘బాహుబలి’ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి.

Bahubali Crown Of Blood Updates

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బాహుబలి’ సిరీస్ కు కొనసాగింపుగా ‘బాహుబలి (క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌)’ పేరుతో యానిమేటెడ్‌ సిరీస్‌ రాబోతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ ను కూడా విడుదల చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు. ‘మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు… ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ యానిమేటెడ్‌ సిరీస్‌ ట్రైలర్‌ రాబోతోంది’ అంటూ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. రాజ‌మౌళి(SS Rajamouli) అలా పోస్టు పెట్ట‌గానే… ఆ పోస్టు క్షణాల్లో సోషల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. కొద్ది రోజుల్లో మేక‌ర్స్‌ మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు.

‘బాహుబలి’ మూవీని వివిధ రూపాల్లో తీసుకొచ్చే అవకాశం ఉందని ఇప్పటికే రాజమౌళి పలు వేదికలపై ప్రకటించారు. మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో కూడిన ఆనంద్‌ నీలకంఠన్‌ రాసిన ‘ది రైజ్‌ ఆఫ్‌ శివగామి’ పుస్తకం కూడా పాఠకులను అలరించింది. ఇప్పుడు యానిమేటెడ్‌ సిరీస్‌ గురించి రాజమౌళి స్వయంగా ప్రకటించడం… అభిమానుల్లో ఈ సిరీస్ పై మరింత క్రేజ్ పెరిగిపోతుంది. మరి ఇందులో ఏయే అంశాలను చూపిస్తారు? శివగామి, కట్టప్ప, అమరేంద్ర బాహుబలి, భళ్లాలదేవుడు, దేవసేన పాత్రలు ఉంటాయా? వాటితో పాటు ఇంకేమైనా కొత్త పాత్రలు వస్తాయా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సరికొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని తన సినిమాలను అత్యున్నత స్థాయిలో తీసే రాజమౌళి యానిమేటెడ్‌ సిరీస్‌ ప్రకటించడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

Also Read : Devaki Nandana Vasudeva : మే లో రానున్న ‘దేవకీ నందన వాసుదేవ’ ఫస్ట్ సింగిల్

BahubaliBahubali Crown Of BloodPrabhasSS Rajamouli
Comments (0)
Add Comment