Baahubali Crown of Blood: తెలుగు చలన చిత్ర పరిశ్రమను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి సిరీస్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ కు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా వందల కోట్ల రూపాయల వసూళ్ళను రాబట్టి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను కొల్లగొట్టింది. దీనితో భారత సినిమా స్థాయిని పెంచిన ‘బాహుబలి’ ని ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో యానిమేటెడ్ వెబ్ సిరీస్ గా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి గతంలో ప్రకటించారు.
Baahubali Crown of Blood Updates
దీనితో ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు దర్శకుడు రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ వెబ్ సిరీస్ ను మే 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌ(Rajamouli)ళి ఇన్‌స్టా వేదికగా ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసి అభిమానులకు సందేశమిచ్చారు.
ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ… ‘బాహుబలి సిరీస్‌ను ఇంకా కొనసాగించండి అని ఎన్నోమంది అభిమానులు అడిగారు. వారందరి కోసం ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ని రూపొందించడం చాలా సంతోషంగా ఉంది. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ కు పనిచేసిన గ్రాఫిక్ ఇండియాతో కలిసి దీన్ని రూపొందించాం. 9 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్ మీ ముందుకు వస్తోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. మీ అందరికీ ఇది నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ఈ సిరీస్ తెలుగుతో పాటు మరో ఆరు భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
ఇటీవల ఓ మీడియా సమావేశంలో రాజమౌళి ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ… ‘బాహుబలిని థియేటర్ లో దాదాపు 10 కోట్ల మంది మాత్రమే చూశారు. మిగతా వాళ్లు టెలివిజన్, ఓటీటీలో చూసి ఉంటారు. ప్రతిఒక్కరూ సినిమాను ఏదో ఒక మాధ్యమం ద్వారా చూస్తారు. అందరూ రెగ్యులర్ సినిమాలు మాత్రమే చూడరు. కేవలం యానిమేషన్ మూవీలను మాత్రమే ఆస్వాదించే వాళ్లూ ఉంటారు. ఆ ఆలోచనతోనే బాహుబలి యానిమేటెడ్ సిరీస్‌ను తీసుకొస్తున్నాం’ అని అన్నారు.
Also Read : Vimala Raman: రీల్ విలన్ తో టాలీవుడ్ హీరోయిన్ రిలేషన్ ?