Anjali Patil: సైబర్ కేటుగాళ్ల వలకు సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా చిక్కుతున్నారు. తాజాగా ‘కాలా’ ఫేమ్ అంజలి పాటిల్… సైబర్ కేటుగాళ్ళ వలకు చిక్కి మోసపోయింది. సుమారు రూ. 5.79 లక్షల రూపాయలను సైబర్ కేటుగాళ్ళకు అప్పగించిన తరువాత… మోసపోయానని గ్రహించి డీఎన్ నగర్ పోలీసులను ఆశ్రయించింది బాలీవుడ్ బ్యూటీ అంజలి(Anjali Patil). ఇక అసలు విషయానికి వస్తే…. కొన్నిరోజుల క్రితం దీపక్ శర్మ అనే వ్యక్తి నుంచి అంజలి పాటిల్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రముఖ కొరియర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి పరిచయం చేసుకున్న అతడు… తైవాన్ కు వెళ్తోన్న పార్శిల్‌లో డ్రగ్స్ దొరికాయని… దానిపై మీ ఆధార్ కార్డు వివరాలు ఉన్నాయని ఆమెతో చెప్పాడు.
Anjali Patil Viral
అంతేకాదు ఆ డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారని… అర్జెంటుగా వెళ్లి ముంబై సైబర్ పోలీసులను కలవాలని సూచించాడు. ఇది జరిగిన కొద్దిసేపటి తరువాత బెనర్జీ అనే మరో వ్యక్తి అంజలికి ఫోన్ చేసి… తాను ముంబయి సైబర్ పోలీసునని పరిచయం చేసుకుని… పలు కారణాలు చెప్పి ఆమె నుంచి సుమారు రూ.5.79 లక్షలు పలుమార్లు తన అకౌంట్ కు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. ఆ తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు స్పందించకపోవడంతో అంజలికి అనుమానం వచ్చి డీఎన్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. అంజలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అంజలిపాటిల్… బాలీవుడ్‌తోపాటు తెలుగు, మరాఠీ, తమిళంలో పలు సినిమాల్లో నటించింది. 2013లో తెలుగులో విడుదలైన ‘నా బంగారు తల్లి’లో ప్రధాన పాత్ర పోషించింది. ‘ది సైలెన్స్’, ‘కాలా’, ‘న్యూటన్’, ‘సమీర్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.
Also Read : Yarta 2: వచ్చేస్తోంది ‘యాత్ర 2’ టీజర్ !