Anasuya Bharadwaj: కేటీఆర్‌ కు నటి అనసూయ ఓదార్పు

కేటీఆర్‌ కు నటి అనసూయ ఓదార్పు

Anasuya Bharadwaj: న్యూస్ ప్రెజెంటర్ గా కెరీర్ మొదలుపెట్టి జబర్ధస్త్ షో యాంకర్ గా ప్రేక్షకులకు దగ్గరై… రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ తో వరుస సినిమా ఆఫర్లు కొట్టేసిన నటి అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj). సినిమాలు, రియాలిటీ షోల కంటే పలు వివాదాస్పద అంశాలకు తెరతీస్తూ సోషల్ మీడియా వేదికగా ఆమె చేసే పోస్టులు టాలీవుడ్ లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటాయి. తన వయసు నుండి వరుసలు కలపడం వరకు చాలా విషయాలపై ఆమె అప్పుడప్పుడు వివాదాస్పదంగా వ్యవహరిస్తుంటారు. అయితే తాజాగా తెలంగాణా ఎన్నికల ఫలితాలపై అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Anasuya Bharadwaj – ఎన్నికల ఫలితాలపై కేటిఆర్ ట్వీట్

తెలంగాణా ఎన్నికల ఫలితాలపై బిఆర్ఎస్ నేత, తాజా మాజీ మంత్రి కేటిఆర్(KTR) ఈ విధంగా ట్వీట్ చేసారు. “వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకి కృతజ్ఞతలు. ఈ రోజు ఫలితాలను చూసి మేము బాధపడటం లేదు.. కానీ ఊహించని విధంగా జరగడంతో కాస్త నిరాశ మాత్రం ఉంది. కానీ ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని తిరిగి కెరటంలా ముందుకొస్తాం. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. వారికి ఆల్ ది బెస్ట్” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

నిమిషాల్లో కేటిఆర్ కు మద్దత్తుగా అనసూయ రిప్లై

దీనిపై కొన్ని నిమిషాల్లోనే స్పందించిన అనసూయ… కేటిఆర్ ట్వీట్ కు రిప్లై ఇస్తూ… ‘ మీరు నిజమైన నాయకుడు సార్. మాలో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండొచ్చు.. బలమైన ప్రతిపక్షంగా ఉండి కూడా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తూ.. మీరు చేసిన అభివృద్ధితో మరోసారి హైదరాబాద్‌పై ప్రేమలో పడేలా చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అనసూయ రిప్లైపై ఫైర్ అవుతున్న నెటిజన్లు… థాంక్యూ ఆంటీ అంటూ వ్యగ్యాస్త్రాలు

అయితే అనసూయ కామెంట్‌ను కోట్ చేస్తూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. థాంక్యూ ఆంటీ, చెప్పింది చాలులే కానీ, అభివృద్ధి అంటే హైదరాబాద్ ఒక్కటి చేస్తే చాలదు ఆంటీ, పెయిడ్ ఆర్టిస్ట్, అసలు నువ్వు ఓటేశావా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఇది ఇలా ఉండగా మరి కొంతమంది మాత్రం ఇన్నాళ్లకి అనసూయ కరెక్ట్‌గా మాట్లాడిందంటూ సపోర్ట్ చేస్తున్నారు. అయితే అనసూయ బహిరంగంగా కేటిఆర్(KTR) ను ఓదార్చడం… సినీ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది.

తెలంగాణా ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరపున పలువురు టివీ, బిగ్ బాస్, సినిమా సెలబ్రెటీలు వివిధ రూపాల్లో ప్రచారం చేసారు. కొంతమంది యాడ్స్ లో నటిస్తే మరికొంతమంది తమ సోషల్ మీడియా ఫాలోవర్స్ ద్వారా ప్రచారం సాగించారు. అయితే వారెవ్వరూ స్పందించకుండా… అనసూయ స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అయితే ఈ అనసూయ విషయాన్ని కొత్తగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో వేచి చూడాలి.

Also Read : Daggubati Rana: దగ్గుబాటి రాణా ఇంట పెళ్ళి సందడి

Anasuya BharadwajKTRTelangana
Comments (0)
Add Comment