Allu Arjun : పుష్ప… పుష్పరాజ్… యవ్వ తగ్గేదే లే అంటూ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 25వరకు జర్మనీలో జరుగుతున్న 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు అతిధిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన జర్మనీ చేరుకున్నారు. 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ సినిమా ప్రాముఖ్యత, చరిత్ర గురించిన అంశాలను అల్లు అర్జున్ మాట్లాడనున్నారని తెలిసింది. అంతేకాదు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘పుష్ప’ సిరీస్ లోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ సినిమా ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ప్రదర్శన చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Allu Arjun As a Special Guest
పుష్ప సినిమా ప్రదర్శన అనంతరం అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్స్, మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ లతో అల్లు అర్జున్ మాట్లాడతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుండి జర్మనీ బయలుదేరిన అల్లు అర్జున్(Allu Arjun) వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనిపై అల్లుతో పాటు మెగా అభిమానులు ఐకాన్ స్టార్ కు కంగ్రాట్స్ చెప్తూ… పుష్ఫరాజ్ సత్తాను ప్రపంచానికి చాటావంటూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.
బెర్లిన్ ఫెస్టివల్ నుంచి తిరిగొచ్చిన తర్వాత అల్లు అర్జున్… ‘పుష్ప: ది రూల్’ షూటింగ్‌లో పాల్గొంటారు. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప: ది రైజ్’ కు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా, ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప: ది రూల్’ కు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది.
Also Read : Senthil Kumar: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం ! ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య మృతి !