Ajith Kumar: కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ తో ఓ సినిమా చేయనున్నట్లు మైత్రీమూవీ మేకర్స్ సంస్థ గురువారం అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ దర్శకుడు అధిక్ రవించంద్రన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు… ‘గుడ్ బ్యాడ్ అగ్లి’ అంటూ టైటిల్ పోస్టర్ ను విడుదల చేసింది. అంతేకాదు ఈ సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెడుతున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ… వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మాట్లాడుతూ… ‘‘కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. అధిక్ స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ… సినీ ప్రియులకు మంచి అనుభవాన్ని ఈ సినిమా అందిస్తుందన్న నమ్మకం ఉంది. జూన్‌లో చిత్రీకరణ మొదలవుతుంది’’ అని అన్నారు. ప్రస్తుతం ‘గుడ్ బ్యాడ్ అగ్లి’ టైటిల్ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారుతోంది.
Ajith Kumar Movie Updates
విశాల్ ‘మార్క్ ఆంటోనీ’తో మంచి హిట్ అందుకున్న అధిక్ రవిచంద్రన్… ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లి’ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అజిత్(Ajith Kumar), అధిక్ కోలీవుడ్ లో మంచి స్నేహితులు. ‘నేర్కొండ పార్వై’ చిత్రంతో వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ‘మార్క్ ఆంటోనీ’ సక్సెస్ మీట్‌లోను అజిత్‌ను గుర్తుచేసుకుంటూ అధిక్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా అభినందన్ రామానుజం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read : Daggubati Venkatesh : హీరో వెంకటేష్ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు