భావోద్వేగానికి గురైన బిగ్ బీ అమితామ్ !
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు అమితాబ్ బచ్చన్. సినిమాలతో పాటు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ రియాలిటీ షోతో దేశం నలుమూలల అభిమానులను సంపాదించుకున్న సీనియర్ నటుడు. ఇప్పటి వరకు 14 సీజన్‌లు పూర్తి చేసుకున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో… ఇప్పుడు 15వ సీజన్‌ను కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ప్రసారం అయిన చివరి ఎపిసోడ్ లో షీలా దేవి, షర్మిలా ఠాగూర్, విద్యాబాలన్, సారా అలీఖాన్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా లాస్ట్ ఎపిసోడ్ లో… కేబీసీ ప్రారంభం నుంచి అమితాబ్ వివిధ సందర్భాల్లో కంటెస్టెంట్లు, ప్రేక్షకులతో మాట్లాడిన వీడియోలను కలిపి ఓ ఏవీ తయారు చేశారు. వేదికపై ప్రసారం చేసిన ఈ ఏవీ ను చూసి అమితాబ్ బచ్చన్ భావోద్వేగానికి గురయ్యారు.
‘మేము దేవుడిని చూడలేదు… కానీ దేవుడి బిడ్డను చూశాం’ అంటూ కేబిసి ఆడియన్స్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఈ రోజు గేమ్ చివరి ఎపిసోడ్. ఇక మళ్లీ ఇక్కడకు తిరిగి రాలేము. ఈ మాటలు చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది, ఇలాంటి రోజు వస్తుందని ఈ ప్రయాణం మొదలుపెట్టినప్పుడే నాకు తెలుసు. నా ప్రేక్షకులతో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలున్నాయి. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదని కోరుకుంటున్నా’’ అని అమితాబ్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.