డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప భారత దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంగా సాగే ఈ సినిమా ఆశించిన దానికంటే అద్భుతమైన విజయాన్ని స్వంతం చేసుకుంది. సుకుమార్ క్రియేటివిటీ, డైనమిజం ఆపై ఆకట్టుకునే సన్నివేశాలు, ప్రత్యేకించి హీరో అల్లు అర్జున్ నటన, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యాజిక్ సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి.
అంతే కాదు ఈ సినిమాకు జనరంజకమైన పాటలను రాసి మెప్పించాడు తెలంగాణకు చెందిన గేయ రచయిత చంద్రబోస్. ఆయన రాసిన ఊ అంటావా మామ ఊ అంటావా అన్న సాంగ్ ఇప్పటికీ మ్యూజిక్ చార్ట్స్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఇక సినిమాలు, వెబ్ సీరీస్ కే పరిమితమైన లవ్లీ గర్ల్ సమంత రుత్ ప్రభును పుష్ప మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఒప్పించారు దర్శక, నిర్మాతలు. ఇది కూడా బిగ్ సక్సెస్ అయ్యింది. తాజాగా పుష్ప మూవీలో కీలకమైన రోల్ పోషించడమే కాకుండా అందరి ఆదరాభిమానాలను చూరగొన్నాడు బన్నీ.
ఇక తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు తొలిసారిగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు స్వంతం చేసుకున్నాడు. ఇది ఓ రికార్డ్. ఢిల్లీలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో బన్నీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు.