Akshay Kumar: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లు చేస్తూ బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులకు వినోదాన్ని అందించే సీనియర్ నటుడు అక్షయ్‌కుమార్. గత కొంతకాలంగా ఆయన నటించిన చిత్రాలు సరైన విజయాన్ని అందుకోవడం లేదు. దీనితో అక్షయ్ కుమార్(Akshay Kumar) మరోసారి వరుస ఫ్లాప్ ల గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. సినిమా రిజల్ట్ అనేది తన చేతిలో లేదని చెప్పారు. పాత్రకు న్యాయం చేయడం కోసం కష్టపడి పని చేస్తానన్నారు.
Akshay Kumar Respond
‘‘ప్రతీ చిత్రాన్ని ఎంతో ఇష్టంతో చేస్తాం. అందులో ప్రాణం పెడతాం. కానీ, ఆయా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందడం చూసి హృదయం ముక్కలవుతుంది. ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే, విజయం సాధించాలనే తపన మరింత పెరుగుతుంది. కెరీర్ ఆరంభంలోనే ఈ విషయాన్ని నేను తెలుసుకున్నా. సినిమా పరాజయం బాధించవచ్చు. ఆ బాధ దాని రాతను మార్చలేదు కదా. అది మన కంట్రోల్‌లో లేనిది. కష్టపడి పని చేయడం మాత్రమే మన కంట్రోల్‌లో ఉంటుంది. ఆవిధంగా నన్ను నేను ఉత్తేజపరచుకుంటూ మరో సినిమా కోసం పనిచేయడం మొదలుపెడతా.
క్రమశిక్షణ, పనిపై నిజాయతీగా ఉండటమే నా బలం. ఫుడ్, వర్కౌట్స్, పనివేళలు.. ఇలా ఒక టైమ్‌టేబుల్ పెట్టుకొని దానికి అనుగుణంగా నడుచుకుంటా. మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండటానికి అదే కారణం. కొవిడ్ తర్వాత చిత్ర పరిశ్రమ ఎంతో మారింది. ప్రేక్షకులు విభిన్నమైన చిత్రాలు చూడటానికే ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు అనుగుణంగా స్క్రిప్ట్‌లు సెలక్ట్ చేసుకోవడం ఎంతో అవసరం అని అక్షయ్ తెలిపారు.
కెరీర్ పరంగా అక్షయ్(Akshay Kumar) దాదాపు 16 ఫ్లాప్‌లు అందుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన నటించిన ‘సెల్ఫీ’, ‘మిషన్ రాణిగంజ్’, ‘బడే మియా ఛోటే మియా’ వంటి చిత్రాలు మిశ్రమ స్పందనలకే పరిమితమయ్యాయి. ఆయన నటించిన రీసెంట్ మూవీ ‘సర్ఫిరా’ కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. ‘సూరారై పోట్రు’కు రీమేక్‌గా ఇది సిద్ధమైంది. కథ బాగున్నప్పటికీ, కలెక్షన్స్ మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయని సినీ విశ్లేషకుల అంచనా.
Also Read : Bellamkonda Sai Sreenivas: నాలుగు వందల ఏళ్ల నాటి గుడి కథతో వస్తున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ !