Actor Vinayakan : మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు వినాయకన్ తన దురుసు ప్రవర్తనతో పదే పదే వార్తల్లో నిలుస్తున్నాడు. రజనీకాంత్, దుల్కర్ సల్మాన్, విశాల్, మమ్ముట్టి, మోహన్‌లాల్, ధనుష్ వంటి పెద్ద నటులతో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ట్యాలెంటెడ్ నటుడు నిజ జీవితంలోనూ విలన్ గా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటికే పలు సార్లు పోలీసులు హెచ్చరించినా వినాయకన్ తన ప్రవర్తనను మార్చుకోవడం లేదు. ఇప్పుడు ఫుల్లుగా తాగిన వినాయకన్(Actor Vinayakan) గోవా లోని రోడ్డు పక్కన టీ కొట్టు ఓనర్ తో గొడవకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వినాయకన్ హావ భావాలు, మాట్లాడే విధానం చూస్తుంటే అతను బాగా తాగి ఉన్నాడని ఇట్టే తెలిసిపోతుంది. ఈ వీడియో వైరల్ కావడంతో, నెటిజన్లు నటుడి ప్రవర్తనను ఖండిస్తున్నారు.
Actor Vinayakan…
వినాయకన్ ఇలా పబ్లిక్‌లో దురుసుగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలోనే హైదరాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై గొడవకు దిగాడు. దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా అతనిపై ఉన్నాయి. దీనిపై పోలీసులు వినాయకన్ ను అరెస్ట్ చేసి ఆ తర్వాత వదిలేశారు. అంతకు ముందు కేరళలోని ఎర్నాకులంలో వినాయకన్ ఇంటి పక్కనున్న వారు కూడా ఈ నటుడిపై ఫిర్యాదు చేశారు. రాత్రి పొద్దుపోయే వరకు తాగుతూ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. దీంతో విచారణ నిమిత్తం అతనని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించగా అక్కడకు కూడా తాగి వచ్చాడు వినాయకన్. అంతేకాదు పోలీస్‌స్టేషన్‌లోనూ వీరంగం సృష్టించాడు.
దీంతో వినాయకన్(Actor Vinayakan)ను అరెస్ట్ చేసిన పోలీసులు బెయిల్‌పై విడుదల చేశారు.1995 నుంచి సినిమాల్లో నటిస్తున్న వినాయకన్ చాలా మంచి నటుడు. మొదట్లో చాలా చిన్న పాత్రల్లో నటించిన ఆయన ఇప్పుడు విలన్‌గా, తండ్రిగా, స్టార్ నటులకు ప్రధాన సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. దుల్కర్ సల్మాన్‌తో ‘కమ్మటిపాడు’ అనే చిత్రంలో వినాయకన్ నటించారు. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనకు రాష్ట్ర అవార్డు, ఫిల్మ్‌ఫేర్‌తో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఇక రజనీకాంత్ జైలర్ సినిమాలో వర్మన్ గా వినాయకన్ అభినయం అందరినీ ఆకట్టుకుంది. అయితే మంచి నటుడే అయినప్పటికీ వినాయకన్ మద్యానికి బానిసై అవకాశాలను పోగొట్టుకుంటున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
Also Read : S J Suryah : వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న నటుడు ‘ఎస్ జె సూర్య’