Aattam : చిన్న చిన్న కథలతో ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచింది మలయాళ చిత్ర పరిశ్రమ. స్టార్‌డమ్, భారీ బడ్జెట్‌తో సెట్‌లు, హంగులు, ఆర్భాటాలు లేకుండా అతి తక్కువ బడ్జెట్‌తో బలమైన కథలను ఎంచుకుని నేటివిటీ మిస్ కాకుండా సినిమాను తెరపై ఆవిష్కరించడం అక్కడి మేకర్స్ ప్రత్యేకత. ఆయా పాత్రలు పోషించడానికి స్టార్స్ సైతం వెనుకాడరు. అందుకే అక్కడ కమర్షియల్ అన్న పేరు తక్కువగా వినిపిస్తుంది. అవార్డు విన్నింగ్ సినిమాల పేర్లు ఎక్కువ వినిపిస్తాయి. కొన్ని చిత్రాలకు అవార్డులతోపాటు రివార్డులు దక్కుతాయి. అలా వచ్చి ప్రేక్షకాదరణ పొంది జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది ‘ఆట్టం(Aattam)’ సినిమా.
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో(National Film Awards) ఉత్తమ చిత్రంగా అవార్డుకు ఎంపికై దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకొందీ చిత్రం. అంతే కాదు బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగాల్లో కూడా పురస్కారాలు దక్కించుకుంది. 1954లో వచ్చిన ‘12 యాంగ్రిమెన్’ హాలీవుడ్ టెలివిజన్ కార్యక్రమం ఆధారంగా ఈ చిత్రాన్ని మలయాళంలో ఆనంద్ ఇకర్షి రూపొందించారు. థియేటర్స్‌లో విడుదలకన్నా ముందే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ (ఐఎఫ్‌ఎఫ్‌ఎల్‌ఏ), ఇంటర్నేషల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ(IFFI)), ఇంటర్నేషల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (ఐఎఫ్‌ఎఫ్‌కే(IFFK)) వేదికలపై ప్రదర్శించారు.
Aattam – కథ :
కేరళలో(Karala) ఓ నాటక బృందం. అందులో 12 మంది నటులు. అందరూ మధ్యతరగతి వారే. వారిలో ఒక్కరే నటీమణి. ఒక్కొక్కరూ ఒక్కో పని చేసుకుంటూ అవకాశం ఉన్నప్పుడల్లా వివిధ వేదికలపై తమ నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ బృందం ప్రదర్శించే నాటికలో వినయ్ (వినయ్ ఫోర్ట్), అంజలి (జరీన్ షిబాబ్), హరి (కళాభవన షాజాన్)లు కీలక పాత్రధారులు. ముఖ్యంగా సినిమా నటుడు అయిన హరికి ఈ నాటకంలో కాస్త అధిక ప్రాధాన్యం ఇవ్వటం వినయ్‌కు నచ్చదు.
ఒకరోజు ఈ బృందం వేసిన నాటకానికి ముగ్థులైన ఓ విదేశీ జంట తమ రిసార్ట్‌లో వాళ్లకు ఆతిథ్యం ఇస్తుంది. అందరూ మద్యం పార్టీలో మునిగి తేలతారు. బాగా పొద్దు పోయాక, ఎవరికి కేటాయించిన గదుల్లోకి వాళ్లు వెళ్లి నిద్రపోతారు. అంజలి ఓ గదిలో కిటికీ పక్కనే నిద్ర పోతుంది. అర్థరాత్రి సమయంలో ఒక వ్యక్తి అంజలి నిద్రపోతున్న కిటికీ పక్కకు వచ్చి అందులోంచి చేయి పెట్టి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి పారిపోతాడు. ఈ 12 మందిలో ఆమెతో అలా తప్పుగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు? అంజలి ఈ విషయాన్ని ఎలా బయటపెట్టింది? చివరకు ఆ అసభ్యకర పని ఆ అదృశ్య వ్యక్తిని గుర్తించారా? లేదా అన్నది కథ.
ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. కొందరిలో రెండు రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. పైకి అందరితోనూ మంచిగా ఉంటూనే సమయాన్ని మాటలు మారుస్తుంటారు. ప్రవర్తనలో తేడా చూపిస్తుంటారు. మనుగడ సాగించడానికి ఎదుటివారిని ఎంతకైనా దిగజార్చి చూపిస్తారు. కోరికలు, అవసరాలు, ఆశల వెంట పరిగెడుతూ ఎదుటి వ్యక్తిని బలి పశువును చేయడమే వాళ్లకు తెలుసు. ఈ క్రమంలో పరిస్థితులను బట్టి వ్యక్తులకు ఇచ్చే గౌరవం, విలువలు మారిపోతాయి. ఇలాంటి అంశాల ఇతివృత్తంగా ‘ఆట్టం(Aattam)’ చిత్రాన్ని తెరకెక్కించారు.
కథ.. పాత్రల పరిచయంతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు.. 12 మందిలో ఒక వ్యక్తి అంజలితో అసభ్యంగా ప్రవర్తించాడన్న విషయం తెలియడంతో అసలు కథ తెరపైకి వస్తుంది.. ఆ పని చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు అందరూ సహ నటుడు అయిన మదన్ ఇంటికి వెళ్లడం, ఈ చర్యకు సినిమా నటుడైన హరిని బాధ్యుడిని చేసే క్రమంలో అతడిని ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడే తీరును దర్శకుడు నేటి మనిషి నైజం, వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా దర్శకుడు చూపించారు.
ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే, అతడు ఏం చేసినా మనకు నచ్చదు. సగటు మనిషి స్వభావం ఇలాగే ఉంటుందని దర్శకుడు చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. కథ ముందుకు నడిచే కొద్దీ, ఎవరు ఆ పని చేశారో ఊహించడం మరింత కష్టమైపోతుంటుంది. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. అనుకోకుండా మదన్ ఇంటికి హరి రావడం, తనకున్న పరిచయాలతో నాటక బృందాన్ని ఇంగ్లాండ్‌కు తీసుకెళ్తానని చెప్పడంతో అప్పటివరకూ దుర్మార్గుడిగా కనిపించిన అతడు అందరికీ మంచివాడైపోతాడు.
ఆ బృందంలో ప్రతి మనిషిలోనూ విదేశాలకు వెళ్లాలన్న ఆశ కలుగుతుంది. అంజలిని పిలిచి సయోధ్య కుదిర్చేందుకు యత్నించే ప్రయత్నాలు చూస్తే మనుషుల్లో ఉండే నిలకడలేనితనం ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. అంజలి వచ్చిన తర్వాత తప్పెవరిది అని కనుక్కొనే ప్రయత్నంలో ప్రతిఒక్కరూ ఎదుటి వ్యక్తి తప్పులను ఎంచేందుకు ప్రయత్నిస్తాడు తప్ప, అసలు అంజలి పడిన వేదనను ఎవరూ అర్థం చేసుకోరు. పైగా పార్టీలో మద్యం తాగినందుకు అంజలిది కూడా తప్పేనని తీర్మానిస్తారు. ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే ఈ చిత్రంలో నటులంతా అద్భుతంగా నటించారు. తెరపై ప్రతి సన్నివేశం సహజంగా ఉంటుంది. చిన్న లైన్ ను తీసుకుని మనిషి నైజాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంది. అందుకే జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డుకు ఎంపికేౖంది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో మలయాళ భాషలో ఉంది. తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.
Also Read : Hero Allu Arjun : హీరో రిషబ్ శెట్టి కి ఉత్తమ నటుడి పురస్కారం..ప్రశంసించిన బన్నీ