Writer Chinnikrishna: ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ… మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశ్యించి మేకప్ వేసుకుని రాజకీయాలు చేసే వారిని ప్రజలు నమ్మొద్దని, “ఇంద్ర” సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే చిరంజీవి కనీసం ప్లేటు భోజనం పెట్టలేదు, రూ. 10 గిఫ్ట్ కూడా ఇవ్వలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా… రచయిత చిన్నికృష్ణ చిరంజీవి నివాసానికి వెళ్ళి అభినందనలు తెలిపారు. అయితే చిరంజీవి నివాసం నుండి బయటకు వచ్చిన అనంతరం గతంలో కొందరి ఒత్తిడి కారణంగా చిరంజీవి గారిపై దుర్భాషలాడినందుకు ఎంతో బాధగా ఉందంటూ ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం రచయిత చిన్నికృష్ణ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Writer Chinnikrishna – చిన్నికృష్ణ వీడియోలో ఏమన్నారంటే ?
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో రచయిత చిన్నికృష్ణ(Writer Chinnikrishna) మాట్లాడుతూ…. ‘మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చిందని తెలిసి ఎంతో ఆనందించా. వాళ్ల ఇంటికెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెప్పాను. చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారు. నా కుటుంబం బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నా వృత్తిగత జీవితం ఎలా ఉందని అడిగారు. ఇవన్నీ చూశాక ఇలాంటి వ్యక్తి గురించా నేను తప్పుగా మాట్లాడింది అని పశ్చాత్తాపపడి క్షమించమని అడిగాను. ‘‘ఏమైనా కథలు ఉంటే కలిసి పనిచేద్దాం’ అని చిరంజీవి అన్నారు. ఈసారి మీతో చేయబోయే సినిమా దేశమంతా గుర్తుంచుకునేలా ఉంటుంది అన్నయ్య. అంత గొప్ప కథ రాస్తాను. మీరు మరెన్నో అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చే జన్మంటూ ఉంటే మీ తమ్ముడిగా పుట్టాలని కోరుకుంటా’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు.
అందరూ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తారు. నేనూ చేశాను. నాపై నమ్మకంతో ‘ఇంద్ర’లో నాకు అవకాశమిచ్చారు. అయితే.. గతంలో ఆయనపై నోటికొచ్చినట్లు మాట్లాడాను. గతంలో కొందరి ఒత్తిడి కారణంగా చిరంజీవి గారిపై దుర్భాషలాడాను. దీనితో నా కుటుంబసభ్యులు, స్నేహితులు నాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ క్షణం నుంచి ప్రతిరోజు నేను భగవంతుడి దగ్గర క్షమాపణలు కోరుతూనే ఉన్నాను. నాలో నేను ఎంతో బాధపడ్డాను అంటూ తాజాగా చిన్నికృష్ణ క్షమాపణలు చెప్పటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
Also Read : Captain Miller: 15 రోజులకే ఓటీటీలోకి ధనుష్ సినిమా ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?