Megastar Chiranjeevi: యావత్ ప్రపంచం ఆశక్తిగా ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం అయోధ్య రామ మందిరంలోని బలరాముడి (రామ్ లల్లా) ప్రాణ ప్రతిష్ఠ. ప్రధాని మోదీ సమక్షంలో సోమవారం జరగబోయే ఈ అపురూప ఘట్టానికి దేశ, విదేశాలకు చెందిన రాజకీయ, సినీ, వ్యాపార, ఆధ్యాత్మిక ప్రముఖులు ముఖ్య అతిధులుగా విచ్చేస్తుండగా సుమారు 10 లక్షల మంది రామ భక్తులు, హిందూ సమాజం ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతుంది.
దీనితో రామ మందిరం ట్రస్ట్ ప్రతినిధులు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందజేసారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చంద్రబాబు వంటి వారికి వారు ఇటీవల ఆహ్వానాలు అందజేసారు.దీనితో మెగాస్టార్ చిరంజీవి… రామ మందిర ట్రస్ట్ ప్రతినిధులు ఇచ్చిన ఆహ్వానం అందుకోవడంతో పాటు… బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఈ ఆహ్వానం… తన కోసం స్వయంగా ఆంజనేయస్వామి పంపిన ఆహ్వానంగా భావిస్తున్నట్లు సోషల్ మీడియా అకౌంట్ (ఎక్స్) వేదికగా మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగంతో పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Megastar Chiranjeevi – చిరంజీవి ట్వీట్ లో ఏముందంటే ?
‘‘చరిత్ర సృష్టించేలా… చరిత్రను పునరావృతం చేసేలా… చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా అయోధ్యలో జరిగే రామలల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అందిన ఆహ్వానం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇది నాకు మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి. 500 సంవత్సరాలుగా తరతరాలు వేచి చూసిన అద్భుతమైన అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. అంజనాదేవి కుమారుడు, ‘చిరంజీవి(Megastar Chiranjeevi)’ అయిన ఆ హనుమాన్… భువిపై ఉన్న ఈ అంజనాదేవి కుమారుడనైన నాకు వెలకట్టలేని గొప్ప క్షణాలను బహుమతిగా ఇచ్చినట్లు అనిపిస్తోంది.
దీనిని మీతో పంచుకోవడానికి నాకు మాటలు సరిపోవడం లేదు. ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇంత మహోన్నత కార్యక్రమం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఉత్తర్ ప్రదేశ్‌ముఖ్యమంత్రి యోగిజీకి కూడా శుభాకాంక్షలు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు. ఆ బంగారు క్షణాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా… జై శ్రీరామ్’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Also Read : Saipallavi Sister Puja: సాయి పల్లవి ఇంట మొదలైన పెళ్లి సందడి !