Director K Balachander: దివంగత ప్రఖ్యాత దర్శకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.బాలచందర్‌కు శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని తమిళనాడు హౌసింగు బోర్డు సొసైటీ అధ్యక్షుడు పూచి మురుగన్ వెల్లడించారు. చెన్నైలోని టి నగర్ లోని టక్కర్ బాబా ఆవరణంలో కె.బాలచందర్ అభిమాన సంఘం నిర్వహించిన దర్శకుడు కె.బాలచందర్ 9వ స్మారక దినోత్సవం కార్యక్రమంలో మైలాపూర్ శాసనసభ్యుడు వేలుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు సొసైటీ అధ్యక్షుడు పూచి మురుగన్ మాట్లాడుతూ… దర్శకుడు కె.బాలచందర్(K Balachander) శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని.. రజనీకాంత్, కమలహాసన్, మమ్ముట్టి తదితర ప్రముఖ నటుల నుండి విజ్ఞప్తి లేఖలు ప్రభుత్వానికి అందాయన్నారు. మరోవైపు కె.బాలచందర్ అభిమాన సంఘం కార్యదర్శి బాబు ప్రభుత్వానికి సమర్పించిన వినతిపత్రంతో బాలచందర్ శిలా విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వ పరిశీలన చివరి దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు కె.బాలచందర్ నివాసం ఉన్న వీధికి ఆయన పేరు పెట్టాలని ఆయన మనసులో మాటను బయటకు వ్యక్తం చేశారు.
Director K Balachander Statue
కె.బాలచందర్ గా ప్రసిద్ధిచెందిన కైలాసం బాలచందర్…1930 జూలై 9న తంజావూరు దగ్గర నన్నిలం గ్రామంలో జన్మించాడు. అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో పనిచేసే బాలచందర్… ఉద్యోగం చేస్తూనే పలు నాటకాలు రాశాడు. ఎంజీఆర్ కథానాయకుడిగా నటించిన దైవతాయ్ చిత్రానికి సంభాషణలతో రచయితగా చలనచిత్ర రంగంలో ప్రస్థానం ప్రారంభించాడు. 45 ఏళ్లలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలను రూపొందించి దక్షిణ భారతదేశ సినిమా చరిత్రలోనే ప్రముఖ దర్శకుడు, రచయిత, నిర్మాతగా గుర్తింపు పొందిన బాలచందర్… రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి నటుల్ని చిత్రపరిశ్రమకు పరిచయం చేశాడు. 2014 డిసెంబరు 23న తుది శ్వాస విడిచారు.
Also Read : Comedian Bonda Mani: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత