తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన అరుదైన కళా రూపం. ప్రజల జీవ నాదం బతుకమ్మ. ప్రపంచంలో ఎక్కడా లేని పండుగ ఇది. కేవలం ఆడబిడ్డలు చేసుకునే అపురూపమైన సంస్కృతికి దర్పణం. ఇవాళ ఎక్కడ చూసినా మహిళలు బతుకమ్మలై ఆడుతున్నారు..పాడుతున్నారు. బతుకమ్మలై సేద దీరుతున్నారు.
బతుకమ్మకు తర తరాల చరిత్ర ఉంది. అంతకు మించిన ఆదరణ ఉంది. బతుకమ్మను ప్రేమించని వాళ్లు లేరు. ఒకనాడు తెలంగాణ సంస్కృతిని, నాగరికతను ఈసడించుకున్న వాళ్లు, సినిమా రంగంలో యాసను, భాషను కించ పరిచేలా చేసిన వాళ్లు ఇప్పుడు తెలంగాణకు పట్టం కడుతున్నారు. ఎందుకంటే ఇవాళ ఎక్కువగా డబ్బులు వచ్చేది సినిమాలకు నైజాం నుంచి.
ఇప్పుడు ఏ హీరో అయినా తెలంగాణ భాషను నేర్చుకోవాల్సిన పరిస్థితి తీసుకు వచ్చిన ఘనత నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలది అని చెప్పక తప్పదు. బతుకమ్మ పేరుతో సినిమాలు వచ్చాయి. ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ సైతం బతుకమ్మ సాంగ్ కు ప్రాణం పోశాడు.
ఇది పక్కన పెడితే తాజాగా ఓరుగల్లులో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. అనిల్ రావిపూడి తీసిన భగవంత్ కేసరి చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక్కడ బతుకమ్మలై ఆడి పాడారు నటులు కాజల్, శ్రీలీల. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.