David Warner: మైదానంలో తనదైన బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపించే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్… ఇప్పుడు వెండితెరపై నటనతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కోవిడ్ సమయంలో పలు టాలీవుడ్ సినిమాల్లో ముఖ్యంగా పుష్ప సినిమాలో పాటకు తన భార్యతో కలిసి స్టెప్పులేసిన ఈ ఫించ్ హిట్టర్… టిక్ టాక్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాబిన్హుడ్’లో ఆయన ఓ అతిధి పాత్రలో మెరవనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో డేవిడ్ వార్నర్(David Warner) అతిథి పాత్రలో తళుక్కున మెరిసినట్లు తెలిసింది.
David Warner in Telugu Movie
ఇటీవలే ఆస్ట్రేలియాలో ఆయన పాత్రకు సంబంధించిన షూట్ పూర్తి చేయగా… లొకేషన్లోని కొన్ని స్టిల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మెల్బోర్న్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో భాగంగా నితిన్, శ్రీలీలపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ గీతానికి కృష్ణకాంత్ సాహిత్యమందించగా… శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఈ పాట పూర్తయిన వెంటనే బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తో సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. యాక్షన్, హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్గా ముస్తాబవుతోన్న ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
పుష్ప సినిమాలోని స్టెప్పులను ఎక్కువగా అనుకరించడంతో పాటు… సోషల్ మీడియాలో వైరల్ గా మారిన స్టిల్స్ కూడా పుష్ప డ్రెస్సింగ్ స్టైల్ ను పోలి ఉండటంతో… పుష్ప 2లో డేవిడ్ వార్నర్ కనిపించబోతున్నట్లు పుకార్లు షికార్లు చేసాయి. అయితే వాటన్నింటికీ పుల్ స్టాప్ పెట్టి… నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో డేవిడ్ వార్నర్ వెండితెరపై ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
Also Read : Megastar Chiranjeevi: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి !