Writer Nadiminti Narsinga Rao: టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ మాటల రచయిత నడిమింటి నరసింగరావు (72) అనారోగ్యంతో మృతిచెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గులాబీ’, రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలోని ‘అనగనగా ఒకరోజు’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్‌తో పాటు ‘పాత బస్తీ, ఊరికి మొనగాడు, కుచ్చికుచ్చి కూనమ్మా’ … ఇలా దాదాపు యాభై సినిమాలకు నరసింగరావు మాటల రచయితగా చేశారు.
Writer Nadiminti Narsinga Rao No More
సినిమాల్లోకి రాకముందు తెలుగు నాటకరంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ‘బొమ్మలాట, రైలుబండి’ వంటి నాటకాలు రాశారు. అలాగే ‘తెనాలి రామకృష్ణ, అంతరంగాలు, లేడీ డిటెక్టివ్, వండర్ బాయ్’ ఇలా దాదాపు యాభై సీరియల్స్‌కు ఆయన మాటలు రాశారు. రచయితగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు, సన్మానాలు ఎన్నో అందుకున్నారు. కాగా ‘ఆదిత్య 369’కి సీక్వెల్ గా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించాలనుకున్న చిత్రం స్క్రిప్ట్ వర్క్‌లో పాలుపంచుకున్నారు. నరసింగరావుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణతో పాటు పలువురు చిత్రరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : Vamsee Krishna: వివాహ బంధంలోనికి అడుగుపెట్టిన టైగర్ నాగేశ్వరరావు దర్శకుడు వంశీ కృష్ణ !