Yamini Krishnamurthy: ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి శివైక్యం !

ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి శివైక్యం !

Hello Telugu - Yamini Krishnamurthy

Yamini Krishnamurthy: ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.

Yamini Krishnamurthy No More

భరత నాట్యం, కూచిపూడి నృత్యంతో భారత దేశఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన యామినీ(Yamini Krishnamurthy) పదహారణాల తెలుగింటి ఆడపడుచు. కృష్ణమూర్తి దంపతులకు ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో 1940లో ఆమె జన్మించారు. నిండుపౌర్ణమి రోజున జన్మించడంతో తాత గారు ఆమెకు యామినీ పూర్ణ తిలక అంటూ నామకరణం చేశారు. అతి చిన్నవయసులోనే కళాక్షేత్ర వ్యవస్థాపకురాలు రుక్మిణీ అరుండేల్ వద్ద చెన్నైలో తొలుత భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. నాట్యం పట్టుదలగా నేర్చుకుని 1956లో తొలి నృత్య ప్రదర్శన ఇచ్చారామె. అనంతరం కాంచీపురం ఎల్లప్ప పిళ్లై, తంజావూరు కిట్టప్పపిళ్లైల వద్ద మెరుగులు దిద్దుకున్నారు. ఆ తర్వాత అంటే.. ఆమె సుమారు ఇరవై ఒక్కేళ్ల వయసులో మద్రాసులో వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి దగ్గర కూచిపూడి నేర్చుకున్నారు. కూచిపూడిలో చింతా కృష్ణ మూర్తి, పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మల దగ్గరా శిష్యరికం చేశారు.

ఎడతెగని నాట్య తృష్ణతో గురుపంకజ్ చరణ్ దాస్, కేలూచరణ్ మహాపాత్రల వద్ద ఒడిస్సీలోనూ శిక్షణ పొందారు. క్షీరసాగరమధనంలో మోహినీగా, భామాకలాపంలో సత్యభామ, ఉషాపరిణయంలో ఉషగా, శశిరేఖాపరిణయంలో శశిరేఖగా ఎన్నో నృత్యరూపకాల్లో పలు పాత్రలను పోషించి ప్రశంసలు అందుకొన్నారు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకొన్నారు. యామినీ(Yamini Krishnamurthy)కి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌, 2016లో పద్మ విభూషణ్‌ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గతంలో తితిదే ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. ఢిల్లీలో ‘యామినీ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ స్థాపించి ఎంతో మంది యువతకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చారు. ఏ ప్యాషన్‌ ఫర్‌ డ్యాన్స్‌ పేరుతో పుస్తకం రచించారు.

యామినీ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం !

యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. భారత దేశం గర్వించదగిన నృత్యకారిణి యామినీ అని కొనియడారు. ఆమె లేని లోటు నృత్య కళారంగంలో ఎవరూ తీర్చలేరన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్టు తెలిపారు.

Also Read : Rashmika Mandanna : వాయనాడ్ బాధితులకు అండగా ఉంటాం ధైర్యంగా ఉండండి..

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com