Vikrant Massey : చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది ‘12th ఫెయిల్(12th Fail)’. విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే(Vikrant Massey) ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందటమే కాకుండా రికార్డులు సాధించింది. ఈ సినిమా జాతీయ అవార్డుల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఇది పోటీ పడనుంది. ఇందులో నటనకుగాను విక్రాంత్ మస్సే కు జాతీయ అవార్డు వస్తుందని ప్రచారం మొదలైంది. దానిపై ఆయన స్పందించారు.
Vikrant Massey Comment
‘‘మా చిత్రం జాతీయ అవార్డుల బరిలో ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు ఇది ఎన్నో ప్రశంసలు అందుకుంది. గొప్ప వేదికలపై దీన్ని ప్రదర్శించారు. నా నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నాను. జాతీయ అవార్డు వస్తుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ చిత్రం కోసం నిజంగానే ఎంతో కష్టపడ్డాను. ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘ ఆవేశం’, ‘ది గోట్ లైఫ్’ వంటి చిత్రాల్లో స్టార్ల నటన అద్బు?తం. వారి సరసన నేను ఉండడం నా అదృష్టం.
జాతీయ అవార్డు వస్తుందా.. రాదా అనే విషయం గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం కాదు. జాతీయ అవార్డుల కంటే ప్రేక్షకులు ఆదరణ గొప్పది’ అన్నారు. మనోజ్ కుమార్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 12వ తరగతి ఫెయిల్ అయిన యువకుడు.. ఐపీఎస్ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో తీర్చిదిద్దారు. ఐఎమ్‌డీబీలో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ సినిమాగా ఈ చిత్రం రికార్డు నెలకొల్పింది. హాలీవుడ్ చిత్రాలను వెనక్కినెట్టి 9.2 రేటింగ్‌తో సంచలనం సృష్టించింది. టాప్ 250 ఉత్తమ చిత్రాల్లోనూ 50వ స్థానం సొంతం చేసుకుంది.
Also Read : Keerthy Suresh: తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించిన ‘మహానటి’ కీర్తి సురేశ్ !