RRR on Oscar Stage: లాస్ ఏంజెలీస్ లోని డాల్బీ థియేటర్ వేదికగా నిర్వహించిన 96వ ఆస్కార్ వేడుకల్లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్(RRR)’ కు స్వీట్ సర్ ప్రైజ్ లభించింది. గతేడాది నిర్వహించిన 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు చిత్ర సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో అస్కార్ వేదికగా ఇంగ్లీషు డ్యాన్సర్లతో ‘నాటు నాటు’ పాటను పాడి ప్రదర్శించారు. అయితే ఈ ఏడాది నిర్వహించిన 96వ అవార్డ్స్‌లో సైతం ‘ఆర్ఆర్ఆర్(RRR)’ విజువల్స్ కనిపించాయి.
RRR on Oscar Stage Viral
సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు రూపొందించే స్టంట్‌మాస్టర్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ వరల్డ్ గ్రేటెస్ట్ స్టంట్ సీక్వెన్స్ అంటూ ఆస్కార్ వేదికపై ప్రదర్శించిన విజువల్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’లోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ లు రెండుసార్లు కనిపించాయి. ‘టైటానిక్’, ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘చార్లీ చాప్లిన్’, ‘బస్టర్ కీటన్’ ‘జాన్విక్’, ‘ది మ్యాట్రిక్స్’లాంటి క్లాసిక్ యాక్షన్ చిత్రాల్లోని సన్నివేశాలతోపాటు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని యాక్షన్ సీన్లను జత చేశారు. హాలీవుడ్ క్లాసిక్ చిత్రాల యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు ‘ఆర్ఆర్ఆర్’లోని యాక్షన్ విజువల్స్ ప్లే కావడం చిత్ర యూనిట్ కు స్వీట్ సర్ ప్రైజ్ లభించినట్లయింది. అలాగే ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ‘వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ ?’ ను విజేతగా ప్రకటించే ముందు ప్లే చేసిన కొన్ని సాంగ్స్ విజువల్స్‌లో ‘ఆర్ఆర్ఆర్(RRR)’లోని ‘నాటు నాటు’ పాట కనిపించింది. ఈ సందర్భంగా.. ‘‘వరల్డ్ స్టంట్ సీక్వెన్స్‌లకు నివాళిగా ప్లే చేసిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో ‘ఆర్ఆర్ఆర్(RRR)’ స్టంట్ సీక్వెన్స్‌లు ఉండటం సంతోషంగా, గర్వంగా ఉంది’’ అని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ తమ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించింది.
ప్రముఖ భారతీయ ఆర్ట్ డిజైనర్ నితిన్ దేశాయ్ కి ఘన నివాళి !
ప్రముఖ భారతీయ ఆర్ట్ డిజైనర్, దివంగత నితిన్ దేశాయ్‌కి 96వ ఆస్కార్ వేడుకల్లో ఘన నివాళి దక్కింది. ‘లగాన్’, ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, ‘జోధా అక్బర్’, ‘ప్రేమ్‌రతన్ ధన్‌పాయో’ లాంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలకు నితిన్ చంద్రకాంత్ దేశాయ్ కళా దర్శకత్వం వహించారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సెట్ సైతం ఆయన వేసిందే. 30ఏళ్ల తన సినీ కెరీర్లో విధూవినోద్ చోప్రా, సంజయ్‌లీలా భన్సాలీ, రాజ్‌కుమార్ హిరాణీ, అశుతోష్ గోవారికర్ లాంటి ఎందరో ప్రముఖ దర్శకులతో కలిసి పని చేశారు. యాభై ఏడేళ్ల దేశాయ్ ముంబయిలోని తన స్టూడియోలో గతేడాది ఆగస్టులో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ‘ఇన్ మెమొరియమ్’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గతేడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా కన్నుమూసిన సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలను స్మరించుకొని, నివాళులర్పించారు. అందులో భాగంగా నితిన్ దేశాయ్ పనితనాన్ని విశేషంగా కొనియాడుతూ… సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆస్కార్ వేదికగా నివాళి అర్పించారు.
Also Read : Oppenheimer: ఆస్కార్ వేదికపై ‘ఓపెన్ హైమర్’ సత్తా ! ఏడు అవార్డులు సొంతం !